ఉత్తరాన్ని పోస్టు చేయాలంటే వీధి చివరికో… నాలుగు రోడ్ల కూడలికో వెళతారు ఎవరైనా.

కానీ అక్కడి పోస్టుబాక్సులో ఉత్తరం వేయాలంటే సముద్రంలో ముప్ఫైరెండు అడుగుల లోతువరకూ వెళ్లాల్సిందే. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం.

జపాన్‌లోని వాకయామా ప్రాంతంలో ఉన్న సుసామీ పోస్టుబాక్సులో ఉత్తరం వేయాలంటే సముద్రంలోకి వెళ్లాలి. పద్దెనిమిది ఏళ్ల కిందట తోషిహికో మసుమోటో అనే పోస్టుమాస్టారుకు వచ్చిన వినూత్నమైన ఆలోచన ఫలితంగా దీన్ని ఏర్పాటుచేశారు.

 

మారుమూల ఉండే సుసామీకి కొంతమంది డైవింగ్‌ చేయడానికి వెళుతుంటారు. ప్రత్యేక ఆకర్షణతో పర్యటకులను రప్పించడానికి నీటి అడుగున పోస్టుబాక్సును ఏర్పాటుచేయాలని తోషిహికో సూచించాడట.

 

ఈ సూచన నచ్చడంతో ప్రపంచంలోనే మొదటిసారిగా సముద్రంలో పోస్టుబాక్సును ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరో అయిదుచోట్ల ఇలాంటి ఏర్పాటు చేసినా అన్నిటికంటే లోతైనది ఇదే. డైవింగ్‌ చేయడానికి వచ్చేవాళ్లు ఈ బాక్సులోనే ఉత్తరాలు వేస్తారు. ఇతరులు ఎవరైనా ఉత్తరాలను ఇచ్చినా వాళ్లు లోపలికి వెళ్లి పోస్టు చేస్తారు. వాటర్‌ప్రూఫ్‌ పోస్టుకార్డులను కొనుక్కుని, వాటిపైన ఆయిల్‌ పెయింట్‌ మార్కర్‌తో రాసి ఉత్తరాలను పోస్టు చేస్తారు. స్థానిక షాప్‌లోని ఉద్యోగి ఉత్తరాలను సేకరించి దగ్గరలోని పోస్టాఫీసులో ఇస్తాడు.

ఏడాదికి పదిహేనువందల ఉత్తరాల వరకూ ఇక్కడి నుంచి వెళతాయి. ఇప్పటివరకూ ముప్ఫైరెండువేల ఉత్తరాలు ఇక్కడి నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయట.

 

Comments

comments