చంద్రబాబు, మోడీ ఇద్దరూ సమఉజ్జీలే. అనేక విషయాలలో వీరికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.

ఇద్దరూ రాజకీయ వ్యూహాలలో నిష్ణాతులు. కాకపొతే వారి ఇద్దరి ప్రతి వ్యూహం వెనుక కుటిలత్వం ఉంటుంది.

తెలుగుదేశం ను చంద్రబాబు రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు. మోడీ కూడా బీజేపీని ఒకసారి అధికారంలోకి తెచ్చారు.

ప్రగల్భాలు, స్వోత్కర్షలలో ఇద్దరూ ఒకరిని మించినవారొకరు.

ఇద్దరూ మీడియా మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో మహామహులు. మోడీకి తోడుగా అమిత్ షా లాంటి ఉద్దండుడు ఉన్నాడు. చంద్రబాబుకు అలాంటి వారెవరూ లేరు.

ఇద్దరూ ఎన్నికలముందు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. ఇచ్చిన వాగ్దానాలతో ఒక్కటి కూడా ఇద్దరూ ఇంతవరకు నిలుపుకోలేదు.

నోట్లరద్దు తో మోడీ దేశం ఆర్ధిక వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఏడాదికి మూడు పంటలు పండే ముప్ఫయి అయిదు వేల ఎకరాల పచ్చని పొలాలను అభివృద్ధి పేరుతో లాగేసుకుని వ్యవసాయ వ్యవస్థను సర్వనాశనం చేశారు చంద్రబాబు.

మాట తప్పడంలో ఇద్దరూ ఇద్దరే.

ప్రజాధనంతో జల్సాలు చెయ్యడంలో ఇద్దరూ ఉద్దండపిండాలు.

ఇద్దరికీ ప్రతిపక్షనాయకులను గౌరవించే సంస్కారం లేదు.

ఇద్దరు నాయకులు తమ నీడను కూడా తాము నమ్మరు.

ఆపత్సమయంలో తనను రక్షించిన గురువు అద్వానీకి వెన్నుపోటు పొడిచారు మోడీ. అలాగే తనకు ఆశ్రయం ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు.

తమకు మెజారిటీ రాకపోయినా కొన్ని రాష్ట్రాలలో మాయోపాయాలతో అధికారాన్ని దక్కించుకున్నారు మోడీ. అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చెయ్యడం ద్వారా బలాన్ని పెంచుకున్నారు చంద్రబాబు.

ఇద్దరిలో ఉన్న తేడా ఒకటే… రాజకీయ కక్ష సాధింపులకు సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించుకుంటారు మోడీ. చంద్రబాబు మాత్రం రాజకీయ కక్షలకు పాల్పడరు. ఏవైనా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తారేమో తప్ప, రాజకీయ జీవితం బలైపోయే వేధింపులకు మాత్రం చంద్రబాబు దూరం.

మోడీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు మాత్రం ప్రతి సమస్యను తన సహచరులతో చర్చిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో సొంతంగా వ్యవహరిస్తారు.

by

ఇలపావులూరి మురళీ మోహన రావు

Comments

comments